తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు ఇనుప బోనుల్లో బంధించారని, అలాంటి వారిని అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు.
పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడినట్లు చెప్పారు. లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద రెండు పాలపిట్టలను పోలీసులు విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించారు. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు వేలాడదీసిన బోనులో నిర్బంధించిన ఒక పాలపిట్టను, మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను కాపాడి అటవీ అధికారులకు అప్పగించారు.
పండగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించడం మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హితవు పలికారు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 1800 425 5364, 9803338666 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.

