Dailyhunt
పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే వేటు తప్పదు.. వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్‌

పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే వేటు తప్పదు.. వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్‌

ల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే, వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే వెంటనే సస్పెండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మరియు ప్రభుత్వ ప్రతిష్టను పణంగా పెట్టడానికి తాను సిద్ధంగా లేనని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. "గీత దాటి ప్రవర్తించే వారిని భరించలేను. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉండాలనుకుంటున్నారా లేదా ఒక్కసారి ఎమ్మెల్యేలుగానే మిగిలిపోవాలనుకుంటున్నారా? అనేది మీరే తేల్చుకోవాలి" అంటూ ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

అసలు ఏం జరిగిందంటే, పల్నాడు జిల్లా పోలీసు సెల్ న్యాయ సలహాదారుగా (లీగల్ అడ్వైజర్) తాను సిఫారసు చేసిన వ్యక్తి పేరును ఎందుకు ఖరారు చేయలేదని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే అరవిందబాబు ఏకంగా పది గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లోనే బైఠాయించారు. ఎనిమిది నెలల క్రితమే తాను లేఖ ఇచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎస్పీ బి. కృష్ణారావుతో వాగ్వాదానికి దిగారు. నియామక ఉత్తర్వు కాపీ చేతికి వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో మంత్రులు లోకేష్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరకు ఎస్పీ ఆ సిఫారసు లేఖపై సంతకం చేసి డీజీ కార్యాలయానికి పంపిన తర్వాతే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లారు.

ఈ ఘటనపై వివరణ కోరగా, ఎమ్మెల్యే అరవిందబాబు నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కలిసి తన వెర్షన్‌ను వినిపించారు. ఈ వివరణను పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి ముందు ఉంచగా, ఆయన తీవ్రంగా స్పందించారు. అధికారులతో ప్రజాప్రతినిధులు ఇలాంటి పద్ధతుల్లో వ్యవహరించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణతో వ్యవహరించని నేతలపై కఠిన చర్యలు ఉంటాయని ఈ ఉదంతం ద్వారా పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు పంపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu