Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పహాడీషరీఫ్ క్రైమ్ మిస్టరీ వీడింది: కామాంధుడి చేతిలో నర్సు బలి..30 గంటల్లోనే నిందితుడి అరెస్ట్!

పహాడీషరీఫ్ క్రైమ్ మిస్టరీ వీడింది: కామాంధుడి చేతిలో నర్సు బలి..30 గంటల్లోనే నిందితుడి అరెస్ట్!

రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన నర్సు హత్య, అత్యాచారం కేసును పోలీసులు 30 గంటల వ్యవధిలోనే ఛేదించారు. తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న 21 ఏళ్ల యువతిని కిరాతకంగా హతమార్చి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఎండీ సనావుల్లా (34)ను పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాకు చెందిన నిందితుడు సనావుల్లా, ఆసుపత్రి సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్‌లో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. గత నెల రోజులుగా హాస్పిటల్ క్వార్టర్స్‌లో ఉంటున్న బాధితురాలి కదలికలపై నిఘా ఉంచిన నిందితుడు, ఆమెపై కన్నేసి అఘాయిత్యానికి పథకం వేశాడు. ఆగస్టు 28 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో కిటికీ గుండా బాధితురాలి గదిలోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె మేల్కొని కేకలు వేయడంతో నోరు మూసి, గొంతు నులిమి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, కిటికీని యథావిధిగా మూసివేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం బాధితురాలు గది నుంచి బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది, బంధువులు కిటికీలోంచి చూడగా ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలో, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మార్గదర్శకత్వంలో పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ బి. లక్ష్మీనారాయణ రెడ్డి బృందం, శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి నిందితుడిని ఆగస్టు 30 సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన శామ్‌సంగ్ మొబైల్ ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై BNS చట్టంలోని హత్య, అత్యాచారం సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu