మహారాష్ట్రలోని ఠాణే జిల్లా కల్యాణ్ పరిధిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కాలయముడిగా మారి కన్నకూతురి ప్రాణాలు తీసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో ఓ తండ్రి తన కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కల్యాణ్ వెస్ట్‌లోని పరేకర్‌వాడి ప్రాంతంలో ఉన్న 'రచనా రాయల్' రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో వినోద్ వాసేకర్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని కుమార్తె గాయత్రి వాసేకర్ కొద్దిరోజుల క్రితం తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా, వేరే సామాజిక వర్గానికి (కులాంతర) చెందిన తను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత గాయత్రి కొద్దిరోజుల పాటు పుట్టింటికి వచ్చింది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం ముగించారు. ఆ సమయంలో గాయత్రి పెళ్లి ప్రస్తావన రావడంతో తండ్రీకూతుళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. కూతురు చేసిన పనిని తీవ్ర అవమానంగా భావించిన తండ్రి వినోద్, కోపోద్రిక్తుడై ఇంట్లోని పదునైన ఆయుధంతో గాయత్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘోర దాడిలో తీవ్ర రక్తస్రావమై గాయత్రి ఎటువంటి వైద్య సహాయం అందకముందే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కూతురు చనిపోయిన వెంటనే ఇంట్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ గందరగోళం మధ్య నిందితుడు వినోద్ వాసేకర్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బజార్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక నిఘా, గూఢచారి సమాచారం, వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం.. మూడు రోజుల తర్వాత నిందితుడు వినోద్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వినోద్ తన నేరాన్ని అంగీకరించాడు. గాయత్రి కులాంతర వివాహం చేసుకోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. గతంలో గాయత్రికి తానే స్వయంగా రెండుసార్లు పెళ్లి సంబంధాలు నిశ్చయించానని, కానీ ఆమె ఆ రెండు సంబంధాలను తిరస్కరించి, తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుందని వెల్లడించాడు. కూతురు తీసుకున్న ఈ నిర్ణయం తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించిందని తీవ్రమైన కక్షను పెంచుకున్నాడు. గాయత్రి పుట్టింటికి వచ్చిన సమయంలో పాత విషయాలు మళ్లీ చర్చకు రావడంతో, తట్టుకోలేక ఆమెను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని కల్యాణ్ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం అతనికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

