ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్‌కుమార్ (యువకుడు) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తన స్నేహితులతో కలిసి సొంతూరికి వచ్చాడు.
అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలింది. దీంతో ప్రేమ్‌కుమార్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వాతావరణంలో జరగాల్సిన వేడుకల్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సందర్భంలో యువకులు విద్యుత్ తీగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

