బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 12.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
ఆయన మరణవార్తతో బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఉన్న సమయంలో సుదర్శన్‌రెడ్డికి అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు గుర్తించి అత్యవసర చికిత్స అందించారు. దాదాపు గంటపాటు నిర్విరామంగా వైద్యసేవలు అందిస్తూ తొమ్మిది సార్లు సీపీఆర్ నిర్వహించిన అనంతరం స్వల్ప స్పందన కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
యశోద ఆస్పత్రిలో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది. అయితే దీర్ఘకాలం పాటు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్‌ఐ, ట్రాన్స్‌క్రానియల్ డాప్లర్ (TCD) పరీక్షల్లో మెదడు దెబ్బతిన్నట్లు సంకేతాలు కనిపించినట్లు వెల్లడించారు. ఐదు రోజుల పాటు చికిత్స కొనసాగించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆయన కన్నుమూశారు.
రైతు కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి...
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఓ రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించిన ఆయన, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్‌ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.

