ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ భద్రతా బృందంలో (ఎస్కార్ట్ విభాగంలో) పనిచేస్తున్న ప్రశాంత్ రాయ్ అనే కానిస్టేబుల్‌ను అత్యాచారం, వేధింపుల ఆరోపణలపై వారణాసి పోలీసులు అరెస్ట్ చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్లుగా ఒక మహిళను లైంగికంగా వేధిస్తూ, ఆమెకు గర్భం దాల్చిన ప్రతిసారి బలవంతంగా అబార్షన్లు చేయించినట్లు నిందితుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి వారణాసి పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మీర్జాపూర్ నివాసి అయిన ప్రశాంత్ రాయ్ గజీపూర్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గత రెండేళ్లుగా మంత్రి రాజ్‌భర్ భద్రతా విధుల్లో ఉన్నాడు. వారణాసిలోని సార్నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె గదిలో ఉంటున్న సమయంలో బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో నాలుగేళ్లపాటు సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, నిందితుడు బలవంతంగా గర్భస్రావం చేయించాడని సార్నాథ్ ఎస్‌హెచ్‌ఓ పంకజ్ కుమార్ త్రిపాఠి తెలిపారు.
అయితే, తనను పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్న బాధితురాలిని మోసం చేస్తూ, నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కానిస్టేబుల్ భాగోతం బయటపడింది. నిందితుడిపై అత్యాచారం, మోసం మరియు బలవంతపు గర్భస్రావానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం నిందితుడిపై తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

