గుజరాత్‌లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను బలవంతంగా సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ మరియు వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లోని శాంతిపురా చౌక్డి నుండి రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వరకు వందలాది ట్రాక్టర్లతో 'కిసాన్ అధికార్ యాత్ర' పేరిట ఈ ర్యాలీ నిర్వహించారు. రైతుల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా పూర్తి మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొంది. కొందరు రైతులు తమ శ్రమకు ప్రతీకగా నాగళ్లను పట్టుకుని ఈ నిరసనలో నడిచారు. తమను సంప్రదించకుండా, సరైన పరిహారం ఇవ్వకుండా అదానీ వంటి ప్రైవేట్ విద్యుత్ సంస్థలు పొలాల్లో ఇష్టానుసారంగా విద్యుత్ స్తంభాలను నాటడాన్ని వెంటనే ఆపాలని, అలాగే రుణమాఫీ, పంటలకు పూర్తి మద్దతు ధర, నకిలీ విత్తనాల నియంత్రణ, సాగునీటి సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు తీవ్ర దోపిడీకి, దారుణమైన పరిస్థితులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల కోసం రైతుల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. దీనిపై న్యాయం అడిగితే పోలీసులు కంపెనీల ఏజెంట్లలా ప్రవర్తిస్తూ రైతులపై, మహిళలపై లాఠీఛార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే ఈ మహా ర్యాలీ చేపట్టామని తెలిపారు. రైతుల హక్కుల కోసం వారు న్యాయం పొందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్, ఆప్ నేతలు స్పష్టం చేశారు.

