Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసు ఉద్యోగాలపై సీఎం రేవంత్‌ శుభవార్త

పోలీసు ఉద్యోగాలపై సీఎం రేవంత్‌ శుభవార్త

హైదరాబాద్‌: 2028 నాటికి పోలీసు శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గోషామహల్‌లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు.

ఇప్పటికే 112 మంది డీఎస్పీలను నియమించామని, తాజాగా 7,437 పోస్టులకు అనుమతినిచ్చి, 4,773 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. 2028 నాటికి అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. పిల్లల కోసం పోలీస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.

అమరవీరుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతున్నట్టు సీఎం రేవంత్‌ ప్రకటించారు. గతంలో ఉన్న రూ.40 నుంచి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను, పోలీసుల హోదాను బట్టి రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఎస్పీలు (SPs), ఐపీఎస్ (IPS) అధికారులకు ఈ ఎక్స్‌గ్రేషియాను ఏకంగా రూ.2 కోట్లకు పెంచినట్లు ప్రకటించారు.

ఈ ఆర్థిక సాయంతో పాటు అమరవీరుల కుటుంబాలకు 'పోలీస్ భద్రత నిధి' నుంచి రూ.16 లక్షలు, పోలీసు సంక్షేమ నిధి నుంచి మరో రూ.8 లక్షలు అందజేయనున్నారు. అలాగే అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నివాస స్థలాలు, పిల్లలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య, వైద్య సదుపాయాలు, బస్ పాస్‌లు మరియు ప్రత్యేక వైద్య, విద్యా రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఏడు రకాల పారామీటర్లలో 80 శాతానికి పైగా స్కోర్ సాధించి 'ఈగల్ తెలంగాణ' సంస్థ జాతీయ స్థాయి డ్రగ్-కంట్రోల్ రివ్యూలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు, మాదకద్రవ్యాల కట్టడికి కృషి చేస్తున్న ఈగల్ టీమ్‌ను, డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమం, డ్రగ్స్ నిరోధక చర్యలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ నిర్ణయాలు నిరూపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu