Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోర్న్‌ యాప్‌ల ముసుగులో భారీ సైబర్ మోసాలు.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక

పోర్న్‌ యాప్‌ల ముసుగులో భారీ సైబర్ మోసాలు.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక

సోషల్ మీడియా వేదికగా అడల్ట్ యాప్‌ల ముసుగులో జరుగుతున్న భారీ ఆర్థిక మోసాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) దేశవ్యాప్తంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని, మాల్వేర్‌తో కూడిన యాప్‌లను డౌన్‌లోడ్ చేయించడం ద్వారా ఫోన్‌లను తమ నియంత్రణలోకి తీసుకుంటూ అనధికారిక ఆర్థిక లావాలకు పాల్పడుతున్నారని ఏజెన్సీ వెల్లడించింది.

ఈ అప్రమత్తతలో భాగంగా NCTAU కొన్ని అనుమానాస్పద యాప్‌లను గుర్తించింది. నైట్ ప్లే (Night Play), రీలూప్ (Reloop), కైస్ (Kyss), విమో (Vimo), రివో (Rivo), నెక్షో (Nexo), విక్సా (Viksa) వంటి యాప్‌లతో పాటు వాటి ఇతర వేరియంట్లు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని హెచ్చరించింది. అశ్లీల ప్రకటనలు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే లింక్స్ ద్వారా ఈ అప్లికేషన్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలపై క్లిక్ చేసిన వినియోగదారులు సాధారణంగా '.live' డొమైన్‌లలో హోస్ట్ చేసిన వెబ్‌సైట్‌లకు మళ్లించబడుతున్నారు. అక్కడ గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇతర అజ్ఞాత మూలల నుంచి ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేయమని ప్రేరేపిస్తున్నారు.

ఈ మాల్వేర్‌ దాడి పలు దశల్లో జరుగుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. మొదటి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పేరుతో మరో ప్యాకేజీని డౌన్‌లోడ్ చేయమని వినియోగదారులను కోరుతారు. ఆ తర్వాత ఈ మాల్వియర్ యాక్సెసిబిలిటీ (Accessibility) మరియు ఇతర సున్నితమైన అనుమతులను పొంది, బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తుంది. అంతేకాకుండా కొన్ని వేరియంట్లు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ను ఇన్‌స్టాల్ చేసి, ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను నేరగాళ్ల కంట్రోల్‌లో ఉండే సర్వర్లకు మళ్లిస్తాయి. దీనివల్ల వ్యక్తిగత, ఆర్థిక డేటా ప్రమాదంలో పడుతుంది. కొన్ని సందర్భాల్లో సాధారణ సెట్టింగ్స్ ద్వారా ఈ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం కూడా సాధ్యం కాదని నిపుణులు హెచ్చరించారు.

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండటానికి వినియోగదారులు కేవలం గూగుల్ ప్లే స్టోర్ వంటి నమ్మదగిన మూలల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని NCTAU సూచించింది. ప్రకటనల ద్వారా వచ్చే ఏపీకే (APK) ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని, అపరిచిత యాప్‌లకు యాక్సెసిబిలిటీ అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే ఫోన్ ఇన్‌ఫెక్ట్ అయితే, ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీస్టార్ట్ చేసి సెట్టింగ్స్ ద్వారా అనుమానాస్పద యాప్‌ను తొలగించాలని, అవసరమైతే ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలని సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu