హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య (Fertility), ఐవీఎఫ్ (IVF) సేవలను మరింత విస్తరించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాల్లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART), సరోగసీ చట్టాల అమలును మరింత కఠినతరం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాల బలోపేతం:
గాంధీ ఆసుపత్రి, పెట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రులలోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలని, భవిష్యత్తులో దశలవారీగా అన్ని జిల్లాలకూ ఈ సేవలను విస్తరించేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంతాన సాఫల్య చికిత్సల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని, నిస్సహాయులైన రోగులపై అనవసర ఆర్థిక భారం మోపకుండా పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన సంతాన సాఫల్య చికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లోనే ఉచితంగా, నాణ్యమైన రీతిలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

