తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికైన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనుంది.
ఇందుకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 30) ఉత్తర్వులు జారీ చేసింది. సబ్-కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఆధ్వర్యంలో వారి కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో (హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో) ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరుగుతుండగా, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరుగుతోంది. ప్రజల సౌకర్యార్థం ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని త్వరలో దశలవారీగా మండల స్థాయికి కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర నోడల్ ఆఫీసర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర స్థాయిలో 'ప్రజావాణి ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ (PMU)'ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ప్రతి ప్రభుత్వ శాఖ తరఫున ఒక నోడల్ అధికారి కూడా ఉంటారు.
స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ విధిగా 'ప్రజావాణి పోర్టల్'లో నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులకు తేదీ, యూనిక్ రిఫరెన్స్ ఐడీతో కూడిన రశీదు అందజేస్తారు. దీని ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ఫిర్యాదు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా లేదా రిజిస్టర్ అయిన తేదీ నుంచి గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించాలని గ్రీవెన్స్ రిడ్రెస్సల్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

