ఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తుందంటూ వస్తున్న వార్తలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పూర్తిగా ఖండించారు.
స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత ఆగస్టు 16 నుంచి 18 వరకు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసే ఉద్దేశం గానీ, ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల గడువును పొడిగించే ఆలోచన గానీ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు పార్లమెంటులో కొనసాగుతున్న స్తబ్ధతను తొలగించేందుకు, వివిధ బిల్లులపై చర్చ జరిపేందుకు మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపు వంటి కీలక ప్రతిపాదనలు కలిగిన రాజ్యాంగ సవరణ బిల్లు గతంలో మూడింట రెండొంతుల మెజారిటీ లభించక వీగిపోవడంతో, మళ్లీ ప్రవేశపెట్టే అంశంపై ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రం చేస్తోంది.
అయితే, నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీఛార్జ్ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చతో పాటు కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆగస్టు 13 వరకు వర్షాకాల సమావేశాలకు సమయం ఉన్నందున, ప్రభుత్వం ప్రతిపక్షాలు మరియు మిత్రపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సభలోనే ముసాయిదాపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

