Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమ లేఖలతో సీఎం రేవంత్ రెడ్డి టైమ్ పాస్ చేస్తున్నారు..!

ప్రేమ లేఖలతో సీఎం రేవంత్ రెడ్డి టైమ్ పాస్ చేస్తున్నారు..!

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. హైడ్రా, మెట్రో, మూసీ, హిల్ట్ పాలసీ వరకు రేవంత్ రెడ్డి విధ్వంస నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

కేసీఆర్ విధానం నిర్మించడం అయితే.. రేవంత్ రెడ్డి విధానం కూలగొట్టడం అన్నారు. మెట్రో విషయంలో ఎల్ అండ్ టీ తో చేసుకున్న ఒప్పందంతో ప్రతి రోజు రెండున్నర కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. బడే భాయ్, చోటే భాయ్ కలిసి మెట్రోను మడత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. మెట్రో రైల్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.

మెట్రో రైల్‌పై కేంద్ర మంత్రితో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి ఏం చర్చలు చేశారో ప్రజలకు చెప్పలేదన్నారు. కేంద్రానికి ప్రేమ లేఖలతో సీఎం రేవంత్ రెడ్డి టైమ్ పాస్ చేస్తున్నారని.. మెట్రో రైల్ విషయంలో చిత్తశుద్ధి ఉంటే రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ మెట్రో రేవంత్ రెడ్డి రద్దు చేసే వారు కాదని.. హైదరాబాద్ నగరంలో అనేక నియోజకవర్గాలకు మెట్రో కనెక్టివిటీ పెరిగేదనన్నారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో మెట్రో రైల్ నిర్వహణ ప్రమాదంలో పడిందన్నారు.

రేవంత్ రెడ్డికి ఇంకా 29 నెలలు మాత్రమే మిగిలి ఉందని డెడ్‌లైన్ గుర్తుచేశారు. మెట్రో విషయంలో రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రో రైల్ పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. 40 లక్షల జనాభా ఉన్న జైపూర్ నగరంలో మెట్రో ఫెజ్-2 కు ప్రధాన మంత్రి శంఖుస్థాపన చేశారని.. కోటీ 30 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి మెట్రో ఫెజ్-2 ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చేతగాని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ నగరం ఆగం అయిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి అని.. నెలకోసారి ఢిల్లీకి కప్పం కట్టేందుకు పోయినా 31 సార్లు వెళ్ళాలని.. కానీ రేవంత్ రెడ్డి 73 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం మీటింగ్ లో ఖాళీ కుర్చీలు కనపడ్డాయని.. ఆయన ప్రస్థానం సరే రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ప్రస్థానం ఎటో ఆలోచించారా..? ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి వేడుకలు చేసుకుంటారా..? అని మండిపడ్డారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఫెయిల్ అయ్యాయన్నారు. గోదావరి నీళ్లను ఆపడం చేతగాని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఆపుతారు అంట అని ఎద్దేవా చేశరు. రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదన్నారు. కేసీఆర్ ఆర్ధిక విధానాలు తెలంగాణను దేశంలో మూడవ స్థానంలో నిలిపాయని ప్రపంచ బ్యాంక్ చెప్పింది.. కాంగ్రెస్ సన్నాసులకు అర్ధం కావడం లేదని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందన్నారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే తెలంగాణకు ప్రాజెక్టులు రావు.. హిట్లర్, తుగ్లక్ కలిసి రేవంత్ రెడ్డిగా మారారని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు రావాల్సిన హక్కులపై రేవంత్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మెయింటనెన్స్ మీకు చేతకాక పోతే మాకు అప్పగించండని అడిగారు. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయడానికి 39 నెలలు పడుతుందా..? కేసీఆర్ 4 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ బృందంగా మేము వస్తాము.. కాంగ్రెస్ నేతలు రావాలని సవాల్ విసిరారు. నీళ్లను లిఫ్ట్ చేద్దాం.. రైతులకు నీళ్లు ఇద్దాం.. ఒకవేళ కొట్టుకుపోతే మనమే ముందు కొట్టుకుపోతామని సూచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఏపీ పేరుతో వచ్చిందని.. ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఉంటుందా.. సంబంధిత మంత్రి ఏం చేస్తున్నారు..? పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఏం చేస్తున్నారు...? ప్రభుత్వం నిద్రలో ఉందన్నారు. సీఎం టూరిజంపై రివ్యూ చేస్తే సంబంధిత శాఖా మంత్రి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu