ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో విశాఖపట్నం (వైజాగ్)ను పరిపాలనా రాజధానిగా, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పదే పదే వ్యాఖ్యానించిన ఆయన, తాజాగా తన రూట్ మార్చి విజయవాడే అసలైన రాజధాని అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడ వచ్చిన జగన్.. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇలాంటి ఘోరమైన ఘటనలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసముండే ప్రాంతానికి అతి సమీపంలోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు పక్కనే ఉంటూ ఇవన్నీ చూస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తిన జగన్.. వాస్తవం మాట్లాడాలంటే మన రాజధాని అమరావతి కాదని, విజయవాడేనని, మనమందరం ఇక్కడే నివసిస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో అమరావతిని గ్రాఫిక్స్ రాజధానిగా చూపించారని గతంలో విమర్శించిన జగన్, ఇప్పుడు నేరుగా విజయవాడే రాజధాని అని స్పష్టం చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

