ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు 21 ఏళ్ల హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు.
ఆదివారం రాత్రి ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, హేమంత్ కత్తితో పోలీసులపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, అక్టోబర్ 31న రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదిలోకి చొరబడిన హేమంత్.. పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
20 గంటల పాటు శస్త్రచికిత్స
మరోవైపు తీవ్రంగా గాయపడిన బాలికకు వైద్యులు దాదాపు 20 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. తొలుత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 8 గంటల పాటు ఆపరేషన్ చేసి బాలిక పరిస్థితిని స్థిరీకరించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరో 12 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

