జనసేన పార్టీని స్థాపించినప్పుడు దేశ సమగ్రత, ప్రజల శ్రేయస్సు తప్ప తనకు మరే ఇతర ఆలోచనా లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీని ప్రారంభించిన సమయంలో అసలు అధికారం వస్తుందో లేదో కూడా తనకు తెలియదన్నారు. దేశ రాజధాని దిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' అనే పేరుతో నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేశామని, ఎన్నో పరాజయాలను కూడా ఎదుర్కొన్నామని గుర్తుచేసుకున్నారు.
మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణిస్తూనే.. పార్టీ పెట్టుకున్న 'ఏడు ప్రాథమిక సూత్రాల'ను ఎన్నడూ వదల్లేదని పవన్ పేర్కొన్నారు. ఒక నిర్దిష్టమైన, ఆచరణాత్మకమైన విధానంతో ముందుకు వెళ్లడం వల్లే ఇటీవల ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను వంద శాతం స్ట్రైక్ రేట్‌తో సాధించగలిగామని చెప్పారు. ప్రారంభంలో కేవలం లక్ష మంది సభ్యత్వంతో మొదలైన జనసేన ప్రస్థానం.. నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వాలతో బలమైన శక్తిగా ఎదిగిందని, ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తాము ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తామని, దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం అనేది ఒక్క రోజుతో ముగిసే పని కాదని, దీనిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎన్నడూ వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే, 2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరును చూసి మాత్రమే తాము ఆవేదన వ్యక్తం చేశామని చెప్పారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన అనాలోచిత తీరు సమాజంలో అసంతృప్తిని, అశాంతిని సృష్టించిందని, అప్పటి నుండి ఇప్పటివరకు వారి ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. దిల్లీలో జనసేన సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడమే అందుకు నిదర్శనమన్నారు.
"దిల్లీ మెడలు వంచుతాం.. మా తడాఖా చూపిస్తాం అంటూ చాలామంది పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. కానీ, వాస్తవానికి అలాంటి నేతలు దిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు. చాలాసార్లు మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం, కానీ సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరికీ శక్తి ఉంటుంది" అని పవన్ పేర్కొన్నారు. ఇదే తరుణంలో మారుతున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. "ఈ మధ్య కాలంలో 'కాక్రోచ్ పార్టీ' (CJP) ఎలా పుట్టుకొచ్చిందో మనం చూస్తున్నాం. ఆ పార్టీని చూస్తే నాకు వేమన రాసిన 'చలిచీమలు చేత చిక్కి చావదె సర్పంబు' అనే పద్యం గుర్తుకొచ్చింది. చిన్నవైనా సరే.. చలిచీమలన్నీ ఏకమైతే ఎంతటి బలమైన పామునైనా చంపేయగలవు. సమాజంలో మార్పు కోసం చిన్న శక్తులైనా కలిసికట్టుగా పోరాడితే అద్భుతాలు సాధించవచ్చు" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

