కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలపై 2025లో ఏకంగా 70,500కు పైగా అవినీతి ఫిర్యాదులు వెల్లువెత్తాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వార్షిక నివేదిక వెల్లడించింది.
ఇందులో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, రైల్వే శాఖలపైనే ఫిర్యాదులు రావడం గమనార్హం. 2025 ఏడాదిలో వివిధ విభాగాల పరిధిలోని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లకు (CVO) మొత్తం 70,584 ఫిర్యాదులు అందగా, డిసెంబర్ 31 నాటికి 64,905 ఫిర్యాదులను పరిష్కరించారు. మిగిలిన 5,679 ఫిర్యాదులు పరిశీలనలో ఉండగా, అందులో 2,002 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. నిబంధనల ప్రకారం విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉన్నందున, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై కమిషన్ నిరంతరం సమీక్షిస్తోంది.
అవినీతి ఆరోపణల్లో 9,933 ఫిర్యాదులతో బ్యాంకింగ్ రంగం అగ్రస్థానంలో నిలిచింది. వీటిలో 9,520 పరిష్కారం కాగా, 413 పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత 9,381 ఫిర్యాదులతో రైల్వే శాఖ రెండో స్థానంలో నిలవగా, అందులో 8,754 కేసులు పరిష్కారమయ్యాయి. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖపై 6,531 ఫిర్యాదులు రాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD), న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC), ఢిల్లీ జల్ బోర్డు వంటి స్థానిక సంస్థలపై 4,834 ఫిర్యాదులు నమోదయ్యాయి. అలాగే బొగ్గు రంగానికి సంబంధించి 4,118, ఆర్థిక శాఖపై 3,107, ఢిల్లీ ప్రభుత్వంపై 2,804, పెట్రోలియం మంత్రిత్వ శాఖపై 2,722, ఢిల్లీ పోలీసులపై 2,633 ఫిర్యాదులు అందాయి. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖపై 2,139, హోం మంత్రిత్వ శాఖపై 2,036 ఫిర్యాదులు దాఖలయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి, కార్మిక, బీమా, టెలికాం, రక్షణ, పౌర సరఫరాలు, ఉక్కు, తపాలా శాఖలపై కూడా వెయ్యికి పైగా చొప్పున అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు, సీవీసీ స్వయంగా పరిశీలించి సీవీవోలకు తగిన చర్యల నిమిత్తం పంపిన 18,651 కేసుల్లో కూడా స్థానిక సంస్థలు, బ్యాంకులు, రైల్వే, పెట్రోలియం, రక్షణ శాఖలే ముందు వరుసలో ఉన్నాయి.

