Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు వెలిగొండ పండుగ.. ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..!

రేపు వెలిగొండ పండుగ.. ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు.

వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం లభించనుంది. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా నిలవనుంది. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదు... ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి, ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు. ఉదయం 10.25 గంటలకు రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి... వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి వెలిగొండకు కృష్ణా జలాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం 2.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu