హైదరాబాద్: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్థిక శాఖ వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి బిల్లుల బకాయిల కోసం రూ.
2,000 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రాబోయే 100 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం మొత్తం రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ఉద్యోగ ఐకాస (JAC) నాయకులకు హామీ ఇచ్చారు. ఈ మాటకు కట్టుబడి, తొలి విడతగా ఈ నిధులను విడుదల చేశారు.
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన జీపీఎఫ్ (GPF) బకాయిలు, అలాగే 2025 మే నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యుటేషన్ బకాయిల చెల్లింపులు పూర్తిగా పూర్తయ్యాయి. మిగిలిన రూ. 4,000 కోట్లను కూడా నిర్ణీత గడువులోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది.
ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం చేతల్లో నిరూపించుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీర్ఘకాలిక బకాయిలన్నింటినీ చెల్లించడానికి ఒక పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు.
తొలి విడతగా రూ. 2,000 కోట్లు విడుదల చేయడంపై ఉద్యోగుల ఐకాస (TG EJAC) తీవ్ర హర్షం వ్యక్తం చేసింది. ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ముందడుగు వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావుతో పాటు అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

