Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిటైర్‌మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ప్లేయర్‌

రిటైర్‌మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ప్లేయర్‌

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు నెయ్‌మార్‌ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిఫా (FIFA) ప్రపంచకప్‌ రౌండ్-16 మ్యాచ్‌లో నార్వే చేతిలో 2-1 తేడాతో బ్రెజిల్ ఘోర పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ ఓటమి తర్వాత 34 ఏళ్ల నెయ్‌మార్‌ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రెజిల్ జట్టుతో తన 16 ఏళ్ల సుదీర్ఘ, అద్భుతమైన ప్రయాణం ముగిసిందని మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఆయన ప్రకటించారు.

న్యూజెర్సీలో జరిగిన ఈ హై-డ్రామా మ్యాచ్‌లో నార్వే ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇంజూరీ టైమ్‌లో నేమార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినప్పటికీ, అది బ్రెజిల్‌ను ఓటమి నుండి కాపాడలేకపోయింది. మ్యాచ్ అనంతరం నెయ్‌మార్‌ మాట్లాడుతూ.. "నేను బ్రెజిల్ కోసం ఆఖరిసారి వరల్డ్ కప్ ఆడాలని ఎంతో ప్రయత్నించాను, శ్రమించాను.. కానీ నా అంతర్జాతీయ ప్రయాణం ఇక ముగిసింది" అని కన్నీటి పర్యంతమయ్యారు. గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన నెయ్‌మార్‌.. ఆ తర్వాత కోచ్ కార్లో అన్సెలొట్టి వ్యూహాల్లో భాగంగా స్కాట్లాండ్, నార్వే మ్యాచ్‌లలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చారు.

బ్రెజిల్ ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్‌గా చరిత్ర:

ఒక తరం ఫుట్‌బాల్‌ను ప్రభావితం చేసిన నెయ్‌మార్‌, బ్రెజిల్ దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి మైదానాన్ని వీడుతున్నారు. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆయన, మొత్తం 129 మ్యాచ్‌లలో 80 గోల్స్ సాధించారు. దశాబ్ద కాలానికి పైగా బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు ఫేస్ ఐకాన్‌గా నిలిచారు.

తన కెరీర్‌లో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడినప్పటికీ, వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలనే కల మాత్రం నెరవేరలేదు. అయినప్పటికీ, 2013లో ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్, 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు చారిత్రాత్మక గోల్డ్ మెడల్ (అంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్) అందించి బ్రెజిల్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల సరసన నెయ్‌మార్‌ స్థానం సంపాదించుకున్నారు. నార్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆయన కొట్టిన పెనాల్టీ గోలే బ్రెజిల్ జెర్సీలో ఆయనకు ఆఖరి గోల్‌గా, ఆఖరి టచ్‌గా మిగిలిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu