Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్!

రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్!

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మేండు లోకనాథంను అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో లోకనాథంపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి (Cr.No. 06/RCA-TCT/2026), తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.

సోదాల అనంతరం తిరుపతి పెద్దకాపువీధిలోని నివాసంలో లోకనాథంను అదుపులోకి తీసుకున్న అధికారులు, వైద్య పరీక్షల అనంతరం ఆయనను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ, టీటీడీలోని పలువురు అధికారుల అక్రమాస్తుల వివరాలను ఏపీ ఏసీబీకి అందించింది. ఈ సమాచారం ఆధారంగా ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) చిన్న అప్పన్నపై కేసు నమోదు చేసిన ఏసీబీ, దర్యాప్తును వేగవంతం చేసి డిప్యూటీ ఈవో లోకనాథంపై చర్యలకు దిగింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామానికి చెందిన లోకనాథం, శ్రీవారి ఆలయ ఉన్నతాధికారి హోదాను అడ్డం పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

ఈ దాడుల్లో సుమారు రూ. 5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం ఇంట్లో రూ. 12.5 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండితో పాటు లోకనాథం, ఆయన కుమారుడి పేరిట ఉన్న 4 ఫిక్స్‌డ్ డిపాజిట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఆయన భార్య పేరిట తిరుపతి పీకే లేఅవుట్‌లో ఓ భవనం, గొల్లవానిగుంటలో రెండు ప్లాట్లు సహా నివాస గృహం, వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యంలో ఓ ప్లాట్, కుమారుడి పేరిట తిరుపతి శ్రీనివాసనగర్‌లో మరో ప్లాట్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ దస్తావేజులను అధికారులు సీజ్ చేశారు. బావమరుదుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగించిన అధికారులు, లోకనాథం భార్య ఉమ్మడి పేరిట ఉన్న రూ. 31.98 లక్షల విలువైన మరో ఆస్తి పత్రాన్ని జప్తు చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా భారీగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu