హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లోని సుమారు రూ. 500 కోట్ల విలువైన తెలంగాణ ఆయిల్‌ఫెడ్ భూమిని కారుచౌకగా ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఆదివారం ఘాటైన బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారిపోయిందని విమర్శించారు.
రూ. 500 కోట్ల భూమి.. కేవలం రూ. 87 కోట్లకే!
అజామాబాద్‌లో మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల (15,984 చదరపు గజాలు) ఆయిల్‌ఫెడ్ భూమిని కేవలం రూ. 87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పగించేందుకు భారీ కుంభకోణానికి తెరలేపారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ రూ. 87 కోట్లను చెల్లించడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని కాదని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టడం వెనుక మర్మమేంటని ఆయన ప్రశ్నించారు. 1987లోనే సుప్రీంకోర్టు సదరు ప్రైవేట్ సంస్థ దావాను కొట్టివేసి ప్రభుత్వానిదే హక్కు అని స్పష్టం చేసినా, కాంగ్రెస్ పాలకులు స్వార్థ ప్రయోజనాలు, కమీషన్ల కోసం అత్యున్నత న్యాయస్థానం తీర్పును సైతం తుంగలో తొక్కారని మండిపడ్డారు.
కేటాయింపును రద్దు చేయకపోతే మహా పోరాటం
వెంటనే ఈ అక్రమ భూ కేటాయింపును రద్దు చేసి, సదరు భూమిని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కే కేటాయిస్తూ ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే చర్యలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ప్రజాక్షేత్రంలో రాజీలేని మహా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

