పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ కెనడాలోని కాల్గరీలో జరుగుతున్న తన 'ఆరా టూర్' (Aura Tour) కాన్సర్ట్‌లో కొందరు ప్రేక్షకులు ఖలిస్తాన్ అనుకూల జెండాలు పట్టుకుని ఉండటాన్ని చూసి షోను మధ్యలోనే ఆపేశారు.
ఆ జెండాలు భారతదేశంలో నిషేధించిన సంస్థకు చెందినవి కావడంతో, వారిని అక్కడి నుంచి పంపించి వేయాలని ఆయన నిర్వాహకులను ఆదేశించారు.
తాను ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లినా పంజాబ్ సమస్యల గురించే మాట్లాడానని, అది తన వ్యక్తిగత ప్రచారం కోసం కాదని దిల్జిత్ దోసాంజ్ స్పష్టం చేశారు. నా పని దానధర్మాలు చేయడం కాదు, కానీ నేను వెళ్లే ప్రతీ వేదికపై పంజాబ్ గురించి మాట్లాడతాను. జాతీయ మీడియా పంజాబ్ గురించి సరిగ్గా పట్టించుకోదని మనం తరచుగా అంటుంటాం. అందుకే నేను పంజాబ్ కోసమే KBC షోకి వెళ్లాను. నా రాష్ట్రానికి అవసరమైనప్పుడు నేను భారీగా విరాళాలు కూడా ఇచ్చాను. నేను టీవీలో ఎవరికైనా ఎదురుగా కూర్చున్నానని మీకు ఇంకా అభ్యంతరం ఉంటే, మీరు ఎన్ని జెండాలు ఊపుకుంటారో ఊపుకోండని ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రముఖ అంతర్జాతీయ షో 'జిమ్మీ ఫాలన్' లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలపైనా దిల్జిత్ దోసాంజ్ స్పందించారు. అది పంజాబ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికే కానీ తన స్వార్థం కోసం కాదని స్పష్టం చేశారు. ఒకప్పుడు భారతీయులకు కెనడాలో ప్రవేశం నిరాకరించబడిన పరిస్థితి నుంచి, ఇప్పుడు వ్యాంకోవర్‌లో 50,000 మందికి పైగా ప్రేక్షకులతో కాన్సర్ట్ చేసే స్థాయికి కాలం ఎలా మారిందో చెప్పారు.

