Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీమలో ఫ్యాక్షన్ యుగం ముగిసింది.. ఇప్పుడు అభివృద్ధే అజెండా..!

సీమలో ఫ్యాక్షన్ యుగం ముగిసింది.. ఇప్పుడు అభివృద్ధే అజెండా..!

స్వర్ణ కుప్పం లక్ష్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పంలో రూ.118 కోట్లతో నిర్మించనున్న ఆధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోకు శంకుస్థాపన చేసిన అనంతరం… అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

అభివృద్ధి అంశాలతో పాటు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వివేకానందరెడ్డి హత్య నుంచి కోడికత్తి ఘటన, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమరావతి రాజధాని, కుప్పం అభివృద్ధి వరకు గత ప్రభుత్వంలో జరిగిన విధానాలను ముఖ్యమంత్రి ఎండగట్టారు.

ఉద్యోగాల కోసం కుప్పమే రావాలి

ఎన్టీఆర్ హయాంలో కుప్పంలో బస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. డిపోలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దే దిశగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని, ఉద్యోగాల కోసం కుప్పం ప్రజలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... ఇతర ప్రాంతాల వారు కుప్పానికి వచ్చే పరిస్థితి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఎంఓయూలు జరిగాయని, వాటి ద్వారా సుమారు 80 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వివరించారు. అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడినా అది కుప్పాన్నే ఎంచుకుందని చెప్పారు. టూ సీటర్ ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ పరిశ్రమతో పాటు డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా కుప్పానికి వచ్చాయని వెల్లడించారు

కుప్పంలోనూ బంగారు గనులు

కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభించినట్లే కుప్పంలోనూ బంగారు గనులు ఉన్నాయని చెబుతున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతామని ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్‌లో కుప్పం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్న సీఎం... రాష్ట్రానికి అది శ్రీరామరక్షగా మారిందన్నారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకొచ్చి 110 చెరువులు నింపామని చెప్పారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన పంటలను ప్రోత్సహించి రాయలసీమను అభివృద్ధి చేస్తామని, వచ్చే నెలలో మదనపల్లెలో దానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కుప్పంలో రోజుకు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా డెయిరీ రంగాన్ని విస్తరిస్తామని, వాణిజ్య పంటలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.

కాలుష్య రహిత కుప్పం నిర్మిద్దాం

ఎస్సీ, ఎస్టీలకు సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, బీసీలు, ఓసీల ఇళ్లపైనా రూ.552 కోట్లతో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. నెట్ జీరో విధానంలో భాగంగా ఇంటి మిద్దెలపైనే కూరగాయలు పండించే విధానాన్ని ప్రోత్సహించాలని, ఈ-సైకిళ్ల వినియోగం పెంచి కాలుష్యరహిత కుప్పాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ ఆధారిత జీవన విధానం వైపు వెళ్లాలని సూచించారు. కుప్పంలోని బ్లూ గ్రానైట్‌కు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకే హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గమంతా మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని, తిరుమల తర్వాత అత్యధిక గ్రీన్ కవర్ ఉన్న ప్రాంతం కుప్పమేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సదుపాయాలు విస్తరించామని, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి

కుప్పానికి వస్తున్న పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే యువత నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించిన చంద్రబాబు... వివాదాస్పద భూములను పరిష్కరిస్తున్నామని, శెట్టిపల్లి, వట్టిచెరుకూరు భూముల సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుమలలో గత పాలకమండలి కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, కూటమి ప్రభుత్వం దాన్ని అరికట్టిందని పేర్కొన్నారు. కుప్పంపై గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని, నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడిందని విమర్శించారు. 2019-24 మధ్య తనను కుప్పంలో పర్యటించ నీయకుండా అడ్డుకున్నారని, తనకు సహకరించిన స్థానికులను వేధించారని ఆరోపించారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది

సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు అభివృద్ధే అజెండాగా మారిందన్నారు. ప్రజల విషయంలో తాను సౌమ్యుడినేనని, కానీ సంఘ విద్రోహ శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. మరో రెండేళ్లలో తన రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తవుతుందని, ఇలాంటి సమయంలో కూడా రౌడీలు, మాఫియాలతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినందువల్లే వివేకానందరెడ్డి హత్య జరిగిందని, కోడికత్తి డ్రామా వచ్చిందని, వాటికి తనను బాధ్యుడిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన డాక్టర్‌ను చనిపోయేలా చేశారని, డ్రైవర్‌ను కారు డిక్కీలో పెట్టి డోర్ డెలివరీ చేశారని వ్యాఖ్యానించారు.

రాజధానిపై రోజుకో కొత్తమాట

రాజధానిపై ప్రతిరోజూ కొత్త మాటలు మాట్లాడుతున్నారని, కేంద్రం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం సాధ్యం కాదన్నారు. అమరావతి రాజధానిని తాము కోరుకుంటుంటే, వాటికన్ తరహాలో 'మావిగన్' కావాలని గొడ్డలి పార్టీ మాట్లాడుతోందని విమర్శించారు. గొడ్డలి పార్టీ అని తాము చెప్పడం కాదని, వారే అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కుప్పాన్ని ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని, ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ సహకారంతో కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సీఎస్సార్, పీ4 విధానాల ద్వారా పేదలను ఆదుకుంటూ కుప్పాన్ని దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu