ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఆయన, రాబోయే అక్టోబరు నాటికే మొత్తం స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
స్థానిక ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అంశంపై మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ మంత్రి లోకేశ్ కార్యాచరణను వివరించారు. దీని ప్రకారం.. తొలుత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత రెండో విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను, చివరి దశలో గ్రామ పంచాయతీ (సర్పంచ్) ఎన్నికలను నిర్వహించనున్నట్లు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డులు-గ్రామాల వారీగా ఓటర్ల జాబితాల సవరణ వంటి కసరత్తును అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారని వెల్లడించారు.
అన్ని స్థానిక సంస్థల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ ప్రకటన, ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు వంటి 'సూపర్ సిక్స్' సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమిలోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వార్డు స్థాయి నుంచి సమన్వయం ఉండేలా చూసుకుంటూ, ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రులను ఆదేశించారు.

