ఢిల్లీ: సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల పెండింగ్‌ను తగ్గించి, న్యాయవ్యవస్థ పనితీరును మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అత్యున్నత నాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తితో (CJI) సహా న్యాయమూర్తుల మంజూరీ సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుండి 38కి పెంచేందుకు ఉద్దేశించిన 'సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026' కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించగా, బుధవారం రాజ్యసభ సైతం స్వచ్ఛంద ఓటు (వాయిస్ వోట్) ద్వారా బిల్లును ఆమోదించి తిరిగి లోక్‌సభకు పంపింది. గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ నూతన చట్టాన్ని తీసుకువచ్చారు.
ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర చట్ట, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో సంస్కరణలలో భాగంగానే జడ్జిల సంఖ్యను పెంచుతున్నామని వెల్లడించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 92,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ద్వారా కేసుల విచారణ త్వరగా పూర్తయి బాధితులకు వేగంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కేవలం జడ్జిల సంఖ్య పెంపే కాకుండా సత్వర న్యాయం కోసం ఆర్బిట్రేషన్, మీడియేషన్ మరియు కాన్సిలియేషన్ వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ADR) మార్గాలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ఈ విషయంలో న్యాయవ్యవస్థతో ప్రభుత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ఇది ఆరోసారి. 1950లో సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 8 మంది జడ్జిలు ఉండేవారు. ఆ తర్వాత కేసుల సంఖ్య ఆధారంగా 1956, 1960, 1978, 1986, 2008లలో పెంచుతూ వచ్చారు. చివరిసారిగా 2019లో ఈ సంఖ్యను 31 నుంచి 34కి సవరించగా, ఇప్పుడు ఆరు సంవత్సరాల విరామం తర్వాత 38కి (CJI + 37 మంది జడ్జిలు) పెంచుతూ చట్ట సవరణ చేశారు.

