తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్ నిర్వహించిన మొదటి భారీ బహిరంగ సభ రాజకీయంగా తీవ్ర సంచలనం రేపింది.
తిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత సభలో సీఎం విజయ్ తన దుస్తులపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు, డీఎంకే (DMK) కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు. తాను సూట్లు ధరించడంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని, సూట్లు వేసుకోవడం కేవలం అధికారంలో ఉన్నవారి హక్కు మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. తాను కేవలం నలుపు, తెలుపు రంగుల సూట్లను మాత్రమే ధరిస్తానని.. తన పరిపాలన, వ్యక్తిత్వం కూడా అంతే స్పష్టంగా (బ్లాక్ అండ్ వైట్) ఉంటాయని, ఆ నలుపు దేనికి సంకేతమో ప్రజలందరికీ తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించి, మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి భారీ ప్రదర్శన ఇది. తన రాజకీయ అరంగేట్రాన్ని దివంగత సీఎం ఎంజీఆర్ (MGR)తో పోల్చడంపై స్పందిస్తూ.. తాను ఎంజీఆర్‌తో పోల్చుకోవడం లేదని, ఎంజీఆర్ ఎప్పటికీ ఎంజీఆరేనని, తాను మాత్రం ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ చూపిన బాటలో నడిచే 'మీ విజయ్' అని ప్రకటించారు. నిబంధనల ప్రకారం తాను పెరంబూర్ ఎమ్మెల్యే అయినప్పటికీ, తిరుచిరాపల్లి ప్రజలు తన గుండెకు ఎంతో దగ్గరని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చి కొన్ని వారాలు కూడా కాకముందే డీఎంకే విమర్శలు మొదలుపెట్టిందని, ఆరు నెలలు సైలెంట్‌గా ఉంటామన్న నిరసనకారులు ఆరు రోజులు కూడా ఆగలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెట్టిన ఇద్దరు వ్యక్తులను కాదని, నిజాయితీగా పనిచేసేందుకు వచ్చిన తనను ప్రజలు ముఖ్యమంత్రిగా కాకుండా, రాష్ట్రానికి 'తొలి సేవకుడి'గా ఎన్నుకున్నారని విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. తనపై వస్తున్న హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను తిప్పికొడుతూ.. ప్రజాతీర్పును అవమానించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసింది డీఎంకే, ఏఐఏడీఎంకేలేనని ఆరోపించారు. ఇకపై తమిళనాడు రాజకీయాల్లో కేవలం డీఎంకే, టీవీకేల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, మధ్యలో మరెవరికీ స్థానం లేదని తేల్చి చెప్పారు. కుల, మత, డబ్బు రాజకీయాలను బద్దలు కొట్టి తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, భవిష్యత్తులోనూ తమ ప్రభుత్వం లౌకికవాదానికి, తమిళనాడు హక్కులకే కట్టుబడి ఉంటుందని సీఎం విజయ్ స్పష్టం చేశారు.

