నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.
పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, పార్టీకి విధేయుడుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీ ఆదేశాలను పాటిస్తానని కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.
తన అభ్యర్థిత్వంపై వివిధ మాధ్యమాల్లో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ''కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం. సంబంధిత వేదికల దృష్టికి తీసుకెళ్లడం నా ప్రధాన లక్ష్యం'' అని తెలిపారు.
తన అభ్యర్థిత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను పట్టభద్రులు, పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కోరారు. పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ''అధిష్టానం నాపై ఉంచిన నమ్మకాన్ని పట్టభద్రుల ఆశీస్సులతో నిలబెట్టుకుంటా'' అని ఆయన అన్నారు.

