తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాలో నిన్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి.
బీజేపీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్లతో దాడి చేయగా.. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. ఈ క్రమంలోనే దాడికి గురైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసాన్ని సందర్శించేందుకు ఆయన వెళ్లకుండా ఈ నిరోధక చర్య చేపట్టారు. పోలీసుల తీరును బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష నాయకులు పార్టీ కార్యకర్తలను కలవకుండా, వారి సమస్యలపై గళం ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు.
గత వారం రోజుల్లో తనకు ఈ విధంగా గృహనిర్బంధం చేయడం ఇది రెండవసారని రామచందర్ రావు తెలిపారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలవకుండా గతంలో అడ్డుకున్న పోలీసులు, తాజాగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి ఘటనను పరిశీలించకుండా తనను నిర్బంధించారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని క్రమపద్ధతిలో అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేశారని, దాడిలో గాయపడిన ఆయన తల్లిని, వర్షిత్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే తనను అడ్డుకోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుందని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని హెచ్చరించారు.
నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి వెనుక కాంగ్రెస్ కార్యకర్తల హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ.. ఆచరణలో మాత్రం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని రామచందర్ రావు విమర్శించారు. బాధితులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవకుండా అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా నిరోధించేందుకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.
నల్గొండలో జరిగిన ఈ దాడుల ఉదంతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్ అరెస్ట్ పరిణామాలు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ పోరును మరింత తీవ్రతరం చేశాయి. బాధితులను పరామర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, పోలీసుల అణచివెతలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.

