తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. రాష్ట్రంలో పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసానిచ్చే ప్రతిష్టాత్మక 'కల్యాణ లక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాల అమలుకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది.
ఈ పథకాల నిధులను నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేయడంతో పథకాల పునరుద్ధరణకు ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోయాయి.
ఈ పథకాల అమలు కోసం 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదన్న కారణంతో సింగిల్ జడ్జి పథకంపై మధ్యంతర స్టే విధించారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి.. ఈ పథకాలు దశాబ్దకాలంగా నిరంతరాయంగా అమలవుతున్నాయని, పిటిషనర్ లబ్ధిదారుడు కానందున అతనికి ఎలాంటి వ్యక్తిగత నష్టం జరగలేదని వాదించారు. విధానపరమైన సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరికాదని, షాదీ ముబారక్ వంటి పథకాలకు గతంలో సుప్రీంకోర్టు అనుమతి కూడా ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరఫున ఏజీ వినిపించిన బలమైన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి విధించిన స్టేను ఎత్తివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది మంది లబ్ధిదారుల దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. హైకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ వ్యాప్తంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు యథావిధిగా నిరంతరాయంగా కొనసాగనున్నాయి.

