తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ప్రధాన 'బాహుబలి' ద్వారం వద్ద ఉద్యోగులు బైఠాయించారు.
రెండో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) అమలు, పెండింగ్‌లో ఉన్న 6 కరవు భత్యం (డీఏ) బకాయిల విడుదల, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) సమస్యల పరిష్కారంతో పాటు వివిధ విభాగాల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాల నేతలు నినదించారు.
ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగులు గుమిగూడటంతో సచివాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

