తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ నాలుగు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శనివారం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సచివాలయంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూల హామీలు ఇచ్చారు.
ఈ పరిణామంతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు మే 5న చేపట్టాలనుకున్న ధర్నా సహా అన్ని నిరసన కార్యక్రమాలను తక్షణమే విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని కొనియాడిన సీఎం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అత్యంత ప్రధానంగా, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం జూన్ 1వ తేదీ నాటికి అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం రాబోయే 100 రోజుల్లో రూ.6,000 కోట్ల భారీ నిధిని విడుదల చేయనున్నారు. విశేషమేమిటంటే, ఈ నిధులను ఎవరికి ఏ ప్రాధాన్యత ప్రకారం పంపిణీ చేయాలో నిర్ణయించే బాధ్యతను సీఎం ఉద్యోగ సంఘాలకే అప్పగించి వారిపై ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. వేతన సవరణ (పీఆర్సీ) నివేదికను కూడా తక్షణమే సమర్పించాలని సంబంధిత కమిషన్‌ను ఆదేశించడమే కాకుండా, నివేదిక అందిన వెంటనే జీతాల పెంపు ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు.
పాలనలో పారదర్శకత, ఉద్యోగులతో నిరంతర సమన్వయం కోసం ఇకపై ప్రతి రెండు నెలలకోసారి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘాలు తమ సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రతి నెలా 1వ తేదీన జీతాలు అందించడం, విద్యాశాఖలో చిక్కుముడిగా మారిన ఉపాధ్యాయ బదిలీలను విజయవంతంగా పూర్తి చేయడం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటివరకు దాదాపు 67,760 ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేస్తూ, ఇది ముమ్మాటికీ "ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

