తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. పిడుగుపాటుకు గురై మహబూబాబాద్ జిల్లా సుదనపల్లి ఐకేపీ కేంద్రంలో నీలం వెంకన్న(42) అనే హమాలీ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మంచిర్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి.
ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మామిడి తోటలకు కూడా ఈ వర్షం వల్ల నష్టం వాటిల్లింది.

