తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల వంటి తీవ్రమైన సామాజిక సమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఒక కీలక అడుగు వేసింది.
ఈ రుగ్మతలను నిర్మూలించడమే ధ్యేయంగా ప్రముఖ 'తరుణి' స్వచ్ఛంద సంస్థతో ప్రభుత్వం అధికారికంగా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ.. "బాల్య వివాహం-బతుకు ఆగం" అనే బలమైన నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ ఒప్పందం ద్వారా కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామ గ్రామాన, ముఖ్యంగా గిరిజన తండాలు, వెనుకబడిన ప్రాంతాలలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరుస్తారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే సమస్యలు, మైనర్ గర్భధారణల వల్ల వచ్చే ప్రాణాపాయాలు మరియు ప్రసవ సమయాల్లో శిశు-మాతృ మరణాల రేటు పెరగడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఐసీడీఎస్ (ICDS) సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మరియు స్థానిక స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను భాగస్వామ్యం చేస్తూ క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచనున్నారు. బాలికల విద్యా హక్కును కాపాడుతూ, వారి బంగారు భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం, తరుణి సంస్థ కలిసి ఉమ్మడిగా కార్యాచరణను అమలు చేయనున్నాయి.

