జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎస్సీ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత రాక చెరువులో మునిగి మృతి చెందారు.
మృతులను 5వ తరగతి చదువుతున్న సుశాంత్(11), 4వ తరగతికి చెందిన విష్ణు (10)గా పోలీసులు గుర్తించారు.
ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ వెనుక వైపు ఉన్న చెరువు వద్దకు వెళ్లిన శ్రీనాథ్, విష్ణు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మునిగిపోయారు. సమాచారం అందుకున్న మల్యాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈత రాకపోవడం వల్లే విద్యార్థులు నీటిలో మునిగిపోయారని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
అయితే, విద్యార్థుల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. తమ పిల్లలు చెరువులోకి ఎలా వెళ్లారో, అసలేం జరిగిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాలను తీసుకోవడానికి నిరాకరించారు. ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధితుల కుటుంబాలతో మాట్లాడి, విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. ఈ ఘటనపై మల్యాల పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

