సంగారెడ్డి జిల్లాలో బైక్ వివాదం చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అత్తింటివారు ద్విచక్రవాహనం కొనివ్వలేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యను గదిలో ఉరేసి దారుణంగా హత్య చేశాడు.
ఆపై పోలీసుల భయంతో తానూ మామిడి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన శుక్రవారం కొండాపూర్ మండలం మారేపల్లి శివారులోని ఓ మామిడితోటలో చోటుచేసుకుంది.
పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య (25)కు 11 నెలల కిందట నారాయణఖేడ్ మండలం సంజీవ్‌రావుపేటకు చెందిన యాదమ్మ (20)తో వివాహమైంది. ఈ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మారేపల్లి శివారులోని ఓ మామిడితోటను కౌలుకు తీసుకుని, అక్కడే నివాసం ఉంటున్నారు. మామిడి పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న అంజయ్య కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. తనకు అత్తింటివారు బైక్ కొనివ్వాలని డిమాండ్ చేస్తూ తరచూ భార్య యాదమ్మతో గొడవ పడేవాడు.
శుక్రవారం ఉదయం అంజయ్య తల్లి మామిడి పండ్లు విక్రయించేందుకు సదాశివపేటకు వెళ్లారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్న సమయంలో బైక్ విషయమై మళ్లీ వివాదం మొదలైంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంజయ్య.. భార్య యాదమ్మను గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడు. భార్య చనిపోయిన తర్వాత ఇది పోలీసు కేసు అవుతుందని, తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఒక మామిడి చెట్టుకు ఉరేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్తయ్యగౌడ్, కొండాపూర్ సీఐ సుమన్‌కుమార్, ఎస్సై సోమేశ్వరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు యాదమ్మ తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లయిన 11 నెలలకే దంపతులిద్దరూ ఇలా విగతజీవులుగా మారడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

