నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓ అభ్యర్థి మద్యం సేవించి పరీక్ష కేంద్రానికి చేరుకున్న విచిత్ర ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
ఆదివారం రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఓ పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ రిజ్వాన్ అనే అభ్యర్థి మద్యం మత్తులో తూలుతూ పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టాడు. అతని ప్రవర్తనను గమనించిన అక్కడి సిబ్బంది, భద్రతా అధికారులు వెంటనే అతడిని అడ్డుకుని ప్రశ్నించారు. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగ్గా.. "నీట్ పరీక్ష రాయడానికి వచ్చా" అంటూ రిజ్వాన్ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మద్యం మత్తులో ఉన్న ఆ అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, దేశవ్యాప్తంగా దాదాపు 1,300 కేంద్రాల్లో, తెలంగాణలో 56 కేంద్రాల్లో నీట్ పీజీ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు.

