Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana: మహిళపై అటెండర్‌ అత్యాచారయత్నం.. నమ్మించి.. బైక్‌ ఎక్కించుకుని..

Telangana: మహిళపై అటెండర్‌ అత్యాచారయత్నం.. నమ్మించి.. బైక్‌ ఎక్కించుకుని..

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నానికి పాల్పడిన రెవెన్యూ విభాగం అటెండర్‌పై బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తిరగబడ్డారు.

ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగానే సదరు అటెండర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మహబూబాబాద్‌ మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నష్టపరిహారం విషయమై శనివారం కలెక్టరేట్‌కు వచ్చారు. కార్యాలయంలో సంబంధిత అధికారులను కలిసి మాట్లాడిన అనంతరం, సాయంత్రం వేళ ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అటెండర్‌ మురళి ఆమెకు పరిచయమయ్యాడు. "నేను కూడా మీ గ్రామం వైపే వెళ్తున్నాను.. బైక్‌పై డ్రాప్ చేస్తాను రండి" అని నమ్మబలికి ఆమెను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. అయితే, మార్గమధ్యలో జనసంచారం లేని ప్రాంతానికి రాగానే అటెండర్ మురళి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. బైక్ ఆపి సదరు మహిళతో తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఊహించని ఈ ప్రమాదం నుండి బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని ఇల్లు చేరింది. జరిగిన ఘోరాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమం జరుగుతుండగా, అక్కడ విధుల్లో ఉన్న అటెండర్ మురళిని బాధితురాలు, ఆమె బంధువులు గుర్తించారు. కోపంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, మహిళ కలిసి అందరూ చూస్తుండగానే మురళిపై దాడికి దిగి దేహశుద్ధి చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన అనంతరం బాధితురాలు కలెక్టరేట్‌ పరిపాలనాధికారి (AO) కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో నమ్మకంగా ఉంటూ మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఈ ఉదంతంపై విచారణ చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu