Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. 15 - 18 తేదీల మధ్య వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. 15 - 18 తేదీల మధ్య వర్షాలు

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. అక్టోబర్ 15 నుంచి 18 తేదీల మధ్య కాలంలో పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారుతుండటంతో ఈ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో ఏయే జిల్లాల్లో వర్షాలు అంటే..

తెలంగాణలోని పలు ఉమ్మడి జిల్లాల్లో రాబోయే కొన్ని రోజుల్లో వానలు పడే సూచనలున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అలాగే మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రివేళల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా వర్షం కురిసే ఛాన్స్ ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాల జోరు:

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, బాపట్లతో పాటు రాయలసీమ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో కమ్ముకుని ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. తీర ప్రాంతాల వెంబడి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu