ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
గవర్నర్ శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. తిరుమలలోని శ్రీభాగ్య విశ్రాంతి భవనానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. రవిచంద్ర, సీవీఎస్‌వో మురళీకృష్ణ పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్, రిసెప్షన్ అధికారులు భాస్కర్, సాత్రే నాయక్ తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు, రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు విమానాశ్రయంలో గవర్నర్‌కు స్వాగతం పలికారు.

