ఉక్రెయిన్‌పై రష్యా రాత్రికి రాత్రే జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడుల్లో మరణించిన 12 మందిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం వెల్లడించారు.
దేశ రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు ఈ వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో నివాస ప్రాంతాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. కీవ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు వరుసగా ఆరో రోజు కొనసాగాయి.
కీవ్ నగరంలో జరిగిన దాడుల్లో చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడినట్లు అత్యవసర సేవల విభాగం పేర్కొంది. అలాగే కీవ్ ప్రాంతంలోని బోరిస్పిల్‌లో మరొకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో మృతుల సంఖ్య 12కు చేరినట్లు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. గత నాలుగు రోజుల్లోనే రష్యా సుమారు 1,500 డ్రోన్లతో విరుచుకుపడిందని, వాటిలో సగానికి పైగా జెట్ ఆధారిత డ్రోన్లేనని ఆయన గతంలో పేర్కొన్నారు. మానవాళి శ్రేయస్సు దృష్ట్యా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని తక్షణమే ముగించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ఈ భీకర దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

