ఉక్రెయిన్‌లో జరుగుతున్న భీకర యుద్ధం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉపాధి కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రష్యా జరిపిన క్షిపణి దాడిలో దుర్మరణం పాలయ్యాడు.
జగిత్యాల జిల్లా హసనాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కీవ్‌తో పాటు పలు ప్రాంతాలపై రష్యా బలగాలు మంగళవారం ఉవ్వెత్తున దాడులు నిర్వహించగా, ఈ హింసాత్మక ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఉక్రెయిన్‌కు వెళ్లడానికి ముందు సుదర్శన్ తన స్వగ్రామంలోనే షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధి వెతుక్కుంటూ సుమారు నాలుగు నెలల క్రితమే ఆయన ఉక్రెయిన్‌కు పయణమయ్యాడు. మంగళవారం రష్యా బలగాలు కీవ్ నగరంపై క్రిజ్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడిన సమయంలో సుదర్శన్ తాను ఉంటున్న గది నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో జరిగిన పేలుళ్ల ధాటికి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉక్రెయిన్‌లోనే ఉంటున్న తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ద్వారా సుదర్శన్ మృతి చెందిన వార్త అతని కుటుంబ సభ్యులకు చేరింది. గది నుంచి బయటకు వచ్చిన సమయంలో జరిగిన దాడిలో సుదర్శన్ అక్కడికక్కడే మరణించినట్లు కుటుంబానికి సమాచారం అందడంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విదేశాల్లో బతుకుదెరువు కోసం వెళ్లి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో సుదర్శన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.

