ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు ఘన నివాళులర్పించారు.
కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ షర్మిల సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.
కాలం ఎంత వేగంగా మారినా, తెలుగు నేలపై నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన ముద్ర ఎప్పటికీ చెరగని సంతకమని ఆమె కొనియాడారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఆయన మరణం లేని మహానాయకుడని శ్లాఘించారు. సంక్షేమ పథకాలకు, సమగ్ర అభివృద్ధికి వైఎస్సార్ అనే పేరు ఒక శాశ్వత చిరునామాగా మారిపోయిందని ఆమె పేర్కొన్నారు. ఈ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను గౌరవిస్తున్న కోట్లాది మంది తెలుగు ప్రజలకు రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైఎస్ షర్మిల తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

