Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విడిగా ఉంటూ భార్యగా ఉంటానంటే ఎలా?.. విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

విడిగా ఉంటూ భార్యగా ఉంటానంటే ఎలా?.. విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

భార్యాభర్తలు సుదీర్ఘకాలంగా విడిగా ఉంటున్నట్లయితే, కేవలం తాము కలిసుండేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా మాత్రమే వివాహ బంధాన్ని కొనసాగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇరుపక్షాల మధ్య సుమారు రెండు దశాబ్దాలుగా ఎడబాటు కొనసాగుతుండటం, సంతానం కూడా లేకపోవడంతో పాటు రాజీ ప్రయత్నాలు పూర్తిగా విఫలమైన నేపథ్యంలో విడాకులు మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ వివాద విచారణ చేపట్టింది.

డిసెంబర్ 2005 నుంచి ఈ దంపతులు పూర్తిగా విడివిడిగానే ఉంటున్నట్లు ట్రయిల్ కోర్టులో స్పష్టంగా నిరూపితమైందని ధర్మాసనం పేర్కొంది. భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త మరో వ్యక్తితో కలిసి వెళ్లినప్పటికీ, ఆమె ఎలాంటి సమంజసమైన కారణం లేకుండానే వెళ్లేందుకు నిరాకరించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో భార్య ఉద్దేశపూర్వకంగానే భర్తను విడిచిపెట్టిందని, హైకోర్టు ఈ అంశాన్ని సరిగ్గా అంచనా వేయడంలో పొరబడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వివాహ వ్యవస్థను రక్షించడమే వివాహ చట్టాల ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ, దంపతులు చాలా కాలంగా విడిగా ఉంటున్న వాస్తవికతను చట్టం విస్మరించలేదని ధర్మాసనం గుర్తుచేసింది. హిందూ వివాహ చట్టం (HMA) సెక్షన్ 13(1)(ib) కింద విడాకులు పొందేందుకు అర్హత ఉందా అనే అంశంపై విచారణ జరిపిన కోర్టు, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బంధాన్ని బలవంతంగా కొనసాగించడం వల్ల ఎలాంటి న్యాయం జరగదని తేల్చిచెప్పింది.

ఈ తీర్పులో భాగంగా భార్యకు శాశ్వత భరణం కింద రూ. 7 లక్షలు చెల్లించాలని భర్తను సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి మూడు నెలల లోపు ఈ మొత్తాన్ని ట్రయిల్ కోర్టులో జమ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ మొత్తం చెల్లించకపోతే, ఆ బకాయిపై సంవత్సరానికి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో భార్య రికవరీ కోసం ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu