దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) పథకం దరఖాస్తు గడువును విద్యాశాఖ పొడిగించింది.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. ఆగస్టు 31 నాటికి దేశవ్యాప్తంగా 79,398 తాజా దరఖాస్తులు, 1,87,208 రెన్యూవల్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. గడువులోగా అర్హులైన విద్యార్థులందరూ ఎన్‌ఎస్‌పీ పోర్టల్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఇన్‌స్టిట్యూట్, జిల్లా లేదా రాష్ట్ర నోడల్ అధికారుల ద్వారా ధృవీకరణ (వెరిఫికేషన్) ప్రక్రియ పూర్తయిందో లేదో సరిచూసుకోవాలని హెచ్చరించారు.
ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో దరఖాస్తుల పరిశీలన రెండు దశల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. లెవల్-1 (L1) వెరిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (INO) నిర్వహించనుండగా, లెవల్-2 (L2) వెరిఫికేషన్‌ను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ (DNO) పూర్తి చేస్తారు. L1 వెరిఫికేషన్‌కు అక్టోబర్ 15, 2026 చివరి తేదీ కాగా, L2 వెరిఫికేషన్‌కు అక్టోబర్ 31, 2026 వరకు గడువు ఉంది. ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులు ఎన్‌ఎస్‌పీలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయడం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా ఎనిమిదో తరగతి తర్వాత పేదరికం కారణంగా చదువు మానేయకుండా, 9 నుంచి 12వ తరగతి వరకు విద్యను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఈ స్కాలర్‌షిప్ పథకం కింద అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన 9వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా లక్ష తాజా ఉపకార వేతనాలు అందిస్తారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల ఆధారంగా 10 నుంచి 12వ తరగతి వరకు ఈ స్కాలర్‌షిప్ రెన్యూవల్ చేయబడుతుంది. కేవలం ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. ఎంపికైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.12,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే (DBT విధానంలో) జమ చేయబడతాయి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించకూడదని, 7వ తరగతి పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 5% సడలింపు) సాధించి ఉండాలని అర్హత నిబంధనలు పేర్కొంటున్నాయి.

