Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు అలర్ట్..తెలంగాణ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది!

విద్యార్థులకు అలర్ట్..తెలంగాణ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది!

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యామండలి (TSBIE) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 8వ తేదీ నుంచే ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పదవ తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపుల్లో చేరేందుకు వీలుగా మే 31వ తేదీ వరకు మొదటి విడత దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ అడ్మిషన్ల ప్రక్రియలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బోర్డు కొన్ని కీలక సూచనలు చేసింది. పదవ తరగతి ఒరిజినల్ మార్కుల మెమోలు రావడానికి సమయం పడుతుంది కాబట్టి, విద్యార్థులు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల జాబితా ఆధారంగానే కళాశాలలు తాత్కాలిక ప్రవేశాలు (Provisional Admissions) కల్పించాలని ఆదేశించింది. విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఒరిజినల్ పత్రాలను కళాశాల యాజమాన్యాలు తమ వద్దే ఉంచుకోకూడదని, కేవలం జిరాక్స్ ప్రతులను మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించింది.

విద్యా క్యాలెండర్ ప్రకారం.. జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో అదనపు ఫీజులు వసూలు చేయవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను సంప్రదించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu