Dailyhunt
విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం

విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దోశ పిండి (ఖీరు) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఏప్రిల్ 1న విమల్ అనే వ్యక్తి స్థానిక 'ఘనశ్యామ్ డైరీ' నుంచి కొనుగోలు చేసిన పిండితో ఇంట్లో దోశలు వేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం విమల్, అతని భార్య భావన, ఇద్దరు కుమార్తెలు తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మూడు నెలల చిన్నారి ఏప్రిల్ 3న, నాలుగేళ్ల కూతురు ఏప్రిల్ 5న చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సదరు డైరీ నుంచి పిండి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. అయితే, డైరీ యజమాని ఘనశ్యామ్ షా మాత్రం ఆ రోజు తాను సుమారు 100 కిలోల పిండి విక్రయించానని, మరే ఇతర కస్టమర్ నుంచి ఫిర్యాదు రాలేదని చెబుతున్నారు. విమల్ కుటుంబం 3 కిలోల పిండి కొనగా, కేవలం 300 గ్రాములు మాత్రమే వాడారని అధికారులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే ఈ మరణాలకు అసలు కారణం విషాహారమా లేక మరేదైనా అనేది స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu