విజయనగరం జిల్లా కందిపేటలో ఒక దారుణ హత్య చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న వివాహిత, తన ప్రియుడిని ఇనుప రాడ్‌తో బాది, ఆపై యాసిడ్ పోసి కిరాతకంగా హతమార్చింది.
భర్తకు దూరంగా ఉంటున్న రాములమ్మ, తన బావ కుమారుడైన దనాల శ్రీనుతో కలిసి కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. శ్రీనుకు కూడా భార్య ఉన్నప్పటికీ ఆమెను విడిచి రాములమ్మతో ఉంటున్నాడు.
కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఆవేశంతో ఊగిపోయిన రాములమ్మ, ఇనుప రాడ్‌తో శ్రీను తలపై బలంగా కొట్టింది. ఆ తర్వాత అతడి శరీరంపై యాసిడ్ పోయడంతో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు రాములమ్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

