యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పుష్కరిణిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.
దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట, సరూర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 21, 2026న కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చారు. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో కళ్యాణ కట్ట సమీపంలోని పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రవీణ్ కుమార్ నాలుగేళ్ల చిన్న కుమార్తె శివలింగం ఆధ్యత పుష్కరిణి మెట్ల వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. చిన్నారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు, అక్కడున్న ఇతరులు చిన్నారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 8:32 గంటలకు చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చిన్న వయసులోనే కుమార్తెను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

